అసోంలో బాంబు పేలుళ్లు కలకలం : స్థానికంగా భయానక వాతావరణం


గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశమున్నదనీ, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నిఘావర్గాలు కొన్ని రోజులుగా హెచ్చరికలు చేస్తున్నాయి.  దేశమంతటా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతుండగా.. అసోంలో బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఈ క్రమంలోనే ఈశాన్య రాష్ట్రం అసోంలో ఆదివారం ఉదయం వరుస పేలుళ్లు సంభవించాయి.  గ్రాహం బజార్‌లో తొలి పేలుడు సంభవించగా ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఘటనాస్థలాలకు చేరుకున్న ప్రత్యేక అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. అనుమానిత ప్రాంతాల్లో బాంబ్‌ స్క్వాడ్‌లతో సోదాలు నిర్వహించారు. ఓ వైపు రిపబ్లిక్‌ డే ఉత్సవాలు జరుగుతుండగా.. ఈ ఘటనలతో స్థానికంగా భయానక వాతావరణం నెలకొన్నది. కాగా, ఇది యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అసోం-ఇండిపెండెంట్‌ (యూఎల్‌ఎఫ్‌ఏఐ) పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. గణతంత్ర వేడుకలను బహిష్కరించాలని ఈ నిషేధిత సంస్థ శనివారం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

దిబ్రూగఢ్‌, చరైదేవ్‌, దులియాజాన్‌ ప్రాంతాల్లో గ్రనేడ్‌ పేలుళ్లు సంభవించాయి. అయితే ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )