వ్యాక్సిన్ వికటించి 40 మంది చిన్నారులు అస్వస్థత

ఆదిలాబాద్ రిమ్స్‌ ఆస్పత్రిలో వ్యాక్సిన్ వికటించి 40 మంది చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన  చోటు చేసుకుంది. వీరిలో 10 మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో చిన్నారులందరికీ చికిత్స అందిస్తున్నారు. అదిలాబాద్‌ రిమ్స్‌లోని చిన్నపిల్లల విభాగంలో బుధవారం (ఫిబ్రవరి 5) ఉదయం రోజువారీగా దాదాపు 40 మంది చిన్నారులకు వైద్య సిబ్బంది రోగ నిరోధక టీకా (వ్యాక్సిన్)ను వేశారు. టీకాలు వేసిన 15 నిమిషాల వ్యవధిలోనే వారిలో 10 మంది చిన్నారుల శరీరంపై ఎర్రని దద్దుర్లు రావడం మొదలైంది. 40 మందిలో కేవలం పది మందికే టీకా వికటించిందని వైద్యులు తెలిపారు. ఘటనపై విచారణ జరుగుతోందని రిమ్స్‌ డైరెక్టర్ బలరాం నాయక్‌ తెలిపారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రమాదమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.ఆందోళనకు గురైన చిన్నారుల తల్లిదండ్రులు వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. దీంతో వారు పిల్లలను పరీక్షించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న రిమ్స్‌ డైరెక్టర్ బలరాం నాయక్‌ హుటాహుటిన వార్డుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పిల్లలకు ఇచ్చిన వ్యాక్సిన్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )