తెలంగాణ లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు : రానున్న రెండు రోజులలో తేలికపాటి వర్షాభావం

రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట సాధారణం కన్నా 5 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నందున చలి తీవ్రత తగ్గింది. శుక్రవారం తెల్లవారుజామున నల్గొండలో 15.8, ఆదిలాబాద్‌లో 17, హైదరాబాద్‌లో 20.4, రామగుండంలో 22.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం పగలు హైదరాబాద్‌లో 32.6, రామగుండంలో 31.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రత 33 డిగ్రీల వరకూ నమోదవుతోంది. గాలిలో తేమ 68 శాతం ఉండగా, గంటకు 16 కిలోమీటర్ల వేగంతో గాలి కదలికలు నమోదవుతున్నాయి.మహారాష్ట్ర పరిధిలోని మరాఠ్వాడా ప్రాంతంలో సుమారు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉందని, ఇదే వర్షాలకు కారణమవుతోందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దక్షిణ భారత దేశం నుంచి తెలంగాణ దిశగా తేమగాలులు వీస్తున్నాయని చెప్పారు.శని, ఆదివారాల్లో తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )