మైహోం రామేశ్వర రావుకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి భారీ షాక్

మైహోం అధినేత రామేశ్వర రావుకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి భారీ  షాకిచ్చారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గంలో వందల కోట్లు విలువ చేసే భూమిని నిబంధనలకు విరుద్ధంగా మైహోం సంస్థకు కేటాయించారని, రూ.38 కోట్ల మేర స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారని రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. మైహోం సంస్థతోపాటు తెలంగాణ ప్రభుత్వం, డీఎల్ఎఫ్ సంస్థకు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాలపాటు కేసును వాయిదా వేసింది.2013లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా రాయదుర్గంలోని 424.13 ఎకరాల భూమిని ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్క్ ఏర్పాటు కోసం కేటాయించింది. తర్వాత ఇది టీఎస్‌ఐఐసీగా రూపాంతరం చెందింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ ప్రకారం నిర్మాణాల కోసం ఈ భూముల్లో 31.35 ఎకరాలను డెవలపర్లకు ఆఫర్ చేసింది. ఈ భూముల కోసం డీఎల్ఎఫ్ రాయ్‌దుర్గ్‌ డెవలపర్స్‌ దరఖాస్తు చేసుకోగా దానికే వాటిని అప్పగించారు. ఆ తర్వాత డీఎల్‌ఎఫ్‌ రాయ్‌దుర్గ్‌ డెవలపర్స్‌ పేరును ఆక్వా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌గా మార్చుకోవడానికి అధికారులు అనుమతిచ్చారు. 2014లో తమకు కేటాయించిన భూమికి బదులుగా సమీపంలోని అంతకన్నా విలువైన మరో భూమిని ఇవ్వాలని ఆక్వా స్పేస్‌ కోరగా.. నిబంధనలకు విరుద్ధంగా అనుమతించారని రేవంత్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. మైహోం గ్రూప్‌నకు చెందిన ఆక్వా స్పేస్‌ సంస్థకు అక్రమంగా భూమి కేటాయించారని ఆరోపించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )