తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ కూల్చివేతపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

\
తెలంగాణ రాష్ట్ర  కొత్త సచివాలయ నిర్మాణం అంశంపై తెలంగాణ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ లేకుండానే కొత్త సచివాలయం నిర్మించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది. కూల్చివేతపై ప్రభుత్వానికి అంత తొందరెందుకని కోర్టు ప్రశ్నించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సచివాలయ భవనాలు కూల్చవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.గత విచారణ సందర్భంగా సచివాలయ కూల్చివేత అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే.. నివేదిక ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని ఏఏజీ వివరించారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. డిజైన్లు, ప్లాన్‌ పూర్తి కానప్పుడు కూల్చివేతకు తొందరెందుకని ప్రశ్నించింది. అవసరమైన సాంకేతికత అందుబాటులో ఉన్నా.. ఇంకా డిజైన్‌, ప్లాన్‌ సిద్ధం కాలేదని చెప్పడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది.సచివాలయం కూల్చివేతపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో బుధవారం (ఫిబ్రవరి 12) విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) హైకోర్టులో వాదనలు వినిపించారు. కొత్త సచివాలయం నిర్మాణంపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోలేదని న్యాయస్థానానికి ఆయన తెలిపారు. తుది నిర్ణయం తీసుకోకుండానే భవనాల కూల్చివేతపై ప్రభుత్వానికి తొందరెందుకని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఎలాంటి డిజైన్లు సిద్ధం కానప్పుడు సచివాలయం భవనాల కూల్చివేత ఎందుకు చేపట్టారని సూటిగా ప్రశ్నించింది.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )