హైదరాబాద్ లోని మాదాపూర్‌లో కాలేజీ బస్సు బీభత్సం...

 హైదరాబాద్  నగరంలోని మాదాపూర్‌లో ఓ కాలేజీ బస్సు బీభత్సం.  ప్రైవేట్ కాలేజీకి చెందిన ఓ బస్సు బీభత్సం సృష్టించింది. కాలేజీ పిట్ట గోడను ఢీకొట్టి పక్కనే నిర్మాణంలో ఉన్న భారీ భవంతికి సంబంధించిన గోతిలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖానామెట్ సమీపంలో మంగళవారం (ఫిబ్రవరి 11) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో కాలేజీ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మాదాపూర్‌ ఖానామెట్‌లోని సెయింట్ పౌల్ ఫార్మసీ కాలేజీలో ఈ ఘటన జరిగింది.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు వెల్లడించారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )