కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి నది పరిసర ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన తెలంగాణ సీఎం కేసీఆర్


ముఖ్యమంత్రి కేసీఆర్  కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అక్కడ తుపాకులగూడెం ఆనకట్టను పరిశీలించనున్నారు. తుపాకులగూడెం రిజర్వాయర్‌కు ‘సమ్మక్క బ్యారేజీ’గా పేరు మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను జారీ చేయాల్సిందిగా ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ రావును సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో కరీంనగర్ బయల్దేరి వెళ్లారు. రాత్రికి కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలో బస చేయనున్నారు. గురువారం ఉదయం అక్కడ నుంచి హెలికాప్టర్‌ ద్వారా కాళేశ్వరం పర్యటనకు వెళ్లారు. ముందుగా ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం మేడిగడ్డపై నిర్మించిన లక్ష్మీ ఆనకట్టను పరిశీలించనున్నారు. మేడిగడ్డ రిజర్వాయర్‌లో గోదావరి జలాల నిల్వ తీరు, ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై ఇంజినీర్లు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి నది పరిసర ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. లక్ష్మీ ఆనకట్టతో పాటు సరస్వతి, పార్వతి ఆనకట్టల నుంచి ఎల్లంపల్లి వరకు ఉన్న నీటి నిల్వలకు సంబంధించి అధికారులతో కేసీఆర్‌ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా నిర్మాణ పనులు చేపట్టారు. భవిష్యత్ అవసరాల కోసం మరో టీఎంసీ నీటిని సేకరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )