జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రో రైలులో ప్రయాణించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్ మెట్రో రైలు అధికారులతో మంత్రి కిషన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మెట్రో రైలు అభివృద్ధి, నిర్వహణపై సమీక్షించారు. తనను పిలవకుండానే జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు ప్రారంభించడం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ఎల్‌ అండ్‌ టీ ఎండీ కేవీబీ రెడ్డి, మెట్రో ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే.. మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఈ సమావేశానికి గైర్హాజరవడం గమనార్హం. సమీక్ష అనంతరం జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ను కిషన్‌ రెడ్డి సందర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సహా పలువురు నేతలతో కలిసి జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఎంటీఎస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. పాత నగరానికి కూడా మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కిషన్ రెడ్డి కోరారు. మెట్రో రైలు ఓల్డ్ సిటీ రూపురేఖలు మారిపోతాయన్నారు. కానీ, పాత నగరం అభివృద్ధికి ఎంఐఎం పార్టీ వ్యతిరేకమని విమర్శించారు. ఓల్డ్ సిటీకి మెట్రో రాకపోవడానికి టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలే కారణమని దుయ్యబట్టారు. ఈ కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )