.లక్షల్లో ప్రయాణికులతో కిటకిటలాడుతున్న హైదరాబాద్ మెట్రో


మెట్రోరైలు మొదటి దశ 69.2 కిలోమీటర్లు పూర్తైంది. కారిడార్‌-1 మియాపూర్‌ నుంచి ఎల్‌బీ నగర్‌ వరకు మెట్రో మార్గం మంచి విజయవంతమైంది. ఎల్‌బీ నగర్ నుంచి మియాపూర్ పొడవునా 29 కిలో మీటర్ల మార్గంలో మొత్తం 27 స్టేషన్లు ఉండగా, ఈ మార్గంలో 2.49 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. తొలి రైలు నుంచి ఆఖరి రైలు వరకూ మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. కారిడార్‌-3 నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకు 29 కిలోమీటర్లు ఉంది. దీనిలో మొత్తం 23 స్టేషన్లు ఉన్నాయి. ఈ మార్గంలో సోమవారం 1.65 లక్షల మంది ప్రయాణించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ మార్గంలో రద్దీ మరీ ఉంటోంది. కారిడార్‌-2 జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు ఐదు రోజుల క్రితమే ప్రారంభమైంది. 11 కి.మీ. మార్గంలో 9 స్టేషన్లు ఉన్నాయి. 34 వేల మంది సోమవారం రాకపోకలు సాగించారు. అయితే, కారిడాక్‌-2, 3 కలిపితే కారిడార్‌-1లోని ప్రయాణికుల సంఖ్యకు చేరువకాలేకపోవడం విశేషం.జేబీఎస్‌ - ఎంజీబీఎస్‌ మెట్రో మార్గానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ మార్గం ప్రారంభంలో 30 వేల ప్రయాణికుల ట్రిప్పులు ఉంటాయని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో అంచనా వేయగా.. ఈ సోమవారం 34 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. అయితే, గత కారిడార్ల మాదిరిగా ఈ కారిడార్‌లోనూ రద్దీ పుంజుకునేందుకు మరో నెల రోజులైనా పడుతుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి మంగళవారం మీడియాతో అన్నారు. మూడు కారిడార్లలో కలిపి సోమవారం నాడు 4.47 లక్షల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరినట్లు వెల్లడించారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )