వికారాబాద్ దుర్ఘటన : ఫ్యాన్ కి ఉరేసుకుని యువతీ యువకులు ఆత్మహత్య

 కామునిపల్లి గ్రామానికి చెందిన మమత (20) వికారాబాద్‌లో డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ప్రశాంత్‌ (19) ఆమెకు వరుసకు తమ్ముడు అవుతాడు. పదో తరగతి వరకు చదివిన ప్రశాంత్.. సెంట్రింగ్ పని చేస్తున్నాడు. కొంతకాలం కిందట అతడు తల్లిదండ్రులతో కలిసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి నివాసం ఉంటున్నాడు. మమత, ప్రశాంత్ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చేసిన ప్రశాంత్‌.. తరచూ మమతతో ఫోన్లో మాట్లాడేవాడని తెలుస్తోంది. వీరి ప్రేమాయణం విషయం తెలుసుకున్న పెద్దలు మంచి పద్ధతి కాదని నచ్చజెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే ఆందోళనతో వీరిద్దరూ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ప్రశాంత్ సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి కామునిపల్లి గ్రామానికి చేరుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున ప్రశాంత్, మమత ఇంట్లోనే ఇద్దరూ ఒకే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రశాంత్ తండ్రి గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )