మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారు - ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

త ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటి వరకు తెలంగాణకు లక్షా యాభై వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చినట్లుచూపించారు . లోక్‌సభలో సోమవారం కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ వివరాలను వెల్లడించారు. తెలంగాణకు ఆరేళ్లలో పన్నుల వాటా కింద రూ.85,013 కోట్లు, రాష్ట్రాల విపత్తు నిధి కింద రూ.1289.04 కోట్లు ఇచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. స్థానిక సంస్థల నిధుల కింద రూ.6,511 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం కింద రూ.1,916 కోట్లు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ.3,853 కోట్లు విడుదల చేసినట్లు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. వీటితో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.51,298.84 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.1500.54 కోట్లు తెలంగాణ ఇచ్చినట్లు వివరించారు. ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం తెలిపారు. కేంద్ర మంత్రి వెల్లడించిన నిధుల మొత్తం 1,51,380 కోట్లుగా ఉన్నాయి. 2014-15లో తెలంగాణ మిగులు రెవెన్యూ ఉన్న రాష్ట్రంగా ఉందని.. ఆ తర్వాత క్రమంగా అప్పులు పెరిగాయని నిర్మలా సీతారామన్ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి రూపాయి కూడా కేటాయించలేదని, మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతోందనే విమర్శల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్న వివరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )