సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లా అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష

సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లా అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడికైనా తరలించవచ్చు. మానేరు వాగుపై ఉన్న ఎగువ మానేరు జలాశయం పర్యాటక అభివృద్ధికి అన్ని విధాలా అనుకూలంగా ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 'రైల్వే ప్రాజెక్టుతో జిల్లా ముఖచిత్రం మారుతుంది. వచ్చే మే నెలాఖరులోగా భూ సేకరణ పూర్తి చేయాలి. 2022 నాటికి జిల్లాకు రైలు కూత వినపడాలి. భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టేందుకు వీలుగా రైల్వే అధికారులకు అప్పగించాలి. చట్టపరమైన చిక్కులు రాకుండా భూసేకరణ పకడ్బందీగా సేకరించాలి. సంబంధిత అధికారుల సమన్వయంతో వ్యవహరించాలి. రైల్వే అలైన్‌మెంట్‌ యుటిలిటీ షిప్టింగ్‌లను సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులు జాగ్రత్తగా చేపట్టాలి. కాటేజీల నిర్మాణం, బోటింగ్‌, జలక్రీడలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలో పెద్దపీట వేయాలి.  ఎగువ మానేరు జలాశయం అతిథి గృహాన్ని రూ.2కోట్లతో ఆధునీకరించాలి. అతిథి గృహం లోపలి భాగాలను అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దాలి. నర్మాలలో ప్రాసెసింగ్‌ యూనిట్‌ స్థాపన పనులను ప్రారంభించాలి. మరో పది రోజుల్లో మళ్లీ నర్మాలకు వస్తా.  ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, అతిథి గృహం ఆధునీకరణ పనులు పర్యాటక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తానని' మంత్రి పేర్కొన్నారు. 

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )