టీఎస్‌ఆర్టీసీ కి కేటాయించిన 1000 కోట్లు అప్పెనట !!!తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీకి 2020-21 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కానీ ఈ సొమ్మును  ప్రతిపాదిత అప్పుగానే చూపింది. గతంలోనూ ఇదే తరహాలో కేటాయింపులు చూపి, వాటిలో ఏనాడూ పూర్తి మొత్తం విడుదల చేసిన దాఖలాలు లేవు. ఇటీవల పెరిగిన బస్సు చార్జీల దృష్ట్యా వివిధ వర్గాలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీల (రీయింబర్స్‌మెంట్‌) సొమ్మే దాదాపు రూ.900 కోట్లుగా ఉంది. దీని ప్రస్తావన బడ్జెట్‌లో ఎక్కడా లేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయసమ్మేళనం సందర్భంగా ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు గ్రాంటుగా ఇస్తామని ప్రకటించారు. కానీ ప్రస్తుత బడ్జెట్‌లో అప్పుగా చూపారు. 2018-19లో బడ్జెట్‌లో రూ.500 కోట్లు అప్పుగా కేటాయించి, రీయింబర్స్‌మెంట్‌ క్రింద రూ.300 కోట్లు ఇచ్చారు. 2019-20లో రూ.900 కోట్లు కేటాయించి, దానిలో రూ.400 కోట్లు అప్పుగా ఇచ్చారు. రీయింబర్స్‌మెంట్‌ క్రింద రూ.500 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించారు. కానీ అప్పటికే ఆర్థిక సంవత్సరం ముగియడంతో ఆ నిధులు రాలేదు. ఆర్టీసీ చార్జీలను ఇప్పటికే 25 శాతం పెంచిన ప్రభుత్వం, మరోసారి చార్జీలు పెంచుతామని ప్రకటించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 25 శాతం చార్జీల పెంపుతో సంస్థకు సంవత్సరానికి రూ.900 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. అంటే రోజుకు అదనంగా రూ.3 కోట్లు రావాలి. కానీ రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకే రోజువారీ అదనపు ఆదాయం వస్తున్నది. ఆదాయం ఎందుకు తగ్గిందనే దానిపై ఆర్టీసీ యాజమాన్యం సమీక్ష చేయట్లేదు. పైగా మరోసారి చార్జీలు పెంచుతామనే ప్రభుత్వ ప్రకటన సంస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి సంస్థకు రావల్సిన ఆదాయాన్నే బడ్జెట్‌లో చూపి, ఆర్టీసీ పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించడం విడ్దూరమే. పైగా ఆర్టీసీ కార్గో, పార్సిల్‌ సర్వీసులు ప్రారంభించినట్టు ఆర్థికమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆ సర్వీసులు రోడ్డు ఎక్కలేదు.