కరోనా వైరస్ దెబ్బకి అతలాకుతలం అవుతున్న ఇటలీ దేశం : ఒక్కరోజులో 133 మృత్యు వాతఉత్తర ఇటలీలో కరోనావైరస్ వల్ల ఒక్క రోజులోనే 133 మంది మరణించారు. దీనితో కలిపి దేశంలో ఇప్పటివరకు 366 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారి సంఖ్య కూడా 5,883 నుంచి 7,375కు అంటే 25 శాతం పెరిగిందని సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకటించింది. రోజు రోజుకూ పరిస్థితి తీవ్రం అవుతుండడంతో లోంబార్డీతో పాటు 14 ప్రావిన్సులలో కోటి 60 లక్షల మందిని క్వారెంటైన్ అంటే నిర్బంధంలో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రాంతాల వారు ఎక్కడికైనా ప్రయాణించాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇటలీలోని మిలాన్, వెనిస్ రెండూ కరోనావైరస్ బాధిత ప్రాంతాలే. దేశ వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీలు, వ్యాయామశాలలు, మ్యూజియంలు, నైట్ క్లబ్‌లు అలాగే ఇతర అన్ని వేదికల్ని మూసేయాలని ప్రధాని జుసెప్పే కాంటే ఆదేశించారు. ఏప్రిల్ మూడో తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది.