ప్రపంచ మహిళల క్రికెట్ టి 20 ఫైనల్ లో ఘోరంగా ఓడిన భారత మహిళల జట్టు

 ప్రపంచకప్ తుది మెట్టుపై భారత మహిళల క్రికెట్ టీం ఘోరంగా తడబడ్డారు. అదే సమయంలో కసి, పట్టుదల, ఓపిక, అనుభం చూపెట్టిన ఆస్ట్రేలియా.. ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకొని 85 పరుగుల తేడాతో గెలుపొంది ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో దీప్తీ శర్మ(33), వేద కృష్ణమూర్తి (19) టాప్ స్కోరర్లు కావడం గమనార్హం. ప్రధాన బ్యాటర్లు షెఫాలీ (2), మంధాన(11), రోడ్రిగ్స్‌(0), హర్మన్‌(4) ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో మేగన్‌ స్కట్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. జోనాసన్‌ మూడు వికెట్లు తీసింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన అలిసా హెలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. బెత్ మూనీకి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ దక్కింది.