భారతదేశ వ్యాప్తంగా 29 మందికి సోకినా కరోనా వైరస్

భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 29 కోవిడ్ - 2019 కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వంవెల్లడించింది . వీరిలో 16 మంది ఇటలీ యాత్రికులేనని తెలిపింది. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో 28 మందికి కరోనా సోకినట్లు చెప్పారు. ఢిల్లీలోని మయూర్‌ విహార్‌కు చెందిన 45 ఏండ్ల వ్యక్తికి, అతడి ఆరుగురు బంధువులకు వైరస్‌ సోకినట్టు తేలిందన్నారు. ఆ వ్యక్తి ఇటీవలే ఆగ్రాలో పర్యటించారని, దీంతో అతడి బంధువులకు వైరస్‌ సోకిందన్నారు. వారందరికీ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ దవాఖానలో చికిత్స అందిస్తున్నామని అన్నారు. భారత పర్యటనకు వచ్చిన ఇటలీకి చెందిన 16 మంది యాత్రికులు, వారి డ్రైవర్‌కు కూడా వైరస్‌ సోకినట్టు తేలిందన్నారు. వీరిలో ఇద్దరికి జైపూర్‌లో, మిగతా 15 మందికి చావ్లాలోని ఐటీబీపీ క్యాంప్‌లో చికిత్స అందిస్తున్నామని అన్నారు. తెలంగాణలో ఒకరికి కరోనా నిర్ధారణ అయ్యిందని, మరో ఇద్దరు అనుమానితులను పరీక్షిస్తున్నామని తెలిపారు. కేరళలో గతంలోనే ముగ్గురు కరోనా బాధితులను గుర్తించగా..చికిత్స అనంతరం వారిని డిశ్చార్జి చేసినట్టు చెప్పారు. అయితే తమ ఉద్యోగి ఒకరికి కరోనా పాజిటివ్‌ అని వచ్చినట్లు ప్రముఖ ఆన్‌లైన్‌ పేమెంట్‌ సేవల సంస్థ పేటీఎం బుధవారం సాయంత్రం ప్రకటించింది. దీంతో బాధితుల సంఖ్య 29కి పెరిగింది. గురుగ్రామ్‌కు చెందిన తమ ఉద్యోగి ఇటీవలే ఇటలీ నుంచి తిరిగి వచ్చినట్లు పేటీఎం తెలిపింది.