కుక్కను దత్తత తీసుకో.. 3 నెలల వరకు బీర్ ఫ్రీ

కరోనా మహమ్మారి అమెరికాను ఏ విధంగా కుదిపేస్తోందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అమెరికాలో చాలా చోట్ల లాక్ డౌన్ నడుస్తోంది. ప్రజలు కూడా ఇళ్లలకే పరిమితమైపోతున్నారు. ఇదే సమయంలో.. యానిమల్ షెల్టర్స్‌ను నడిపే సంస్థలు కూడా మనుషులను రానివ్వడం లేదు. మనుషుల సందర్శన కారణంగా జంతువులకు కూడా కరోనా సోకే ప్రమాదముందని ఆయా సంస్థలు భయపడుతున్నాయి. ఈ కారణంగానే జంతువుల సందర్శనను మూసివేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. న్యూయార్క్‌లోని మిడ్ వెస్ట్ యానిమల్ రెస్క్యూ సంస్థ తమ షెల్టర్‌లో ఉన్న కుక్కలను దత్తత ఇచ్చేందుకు సిద్దమయ్యాయి. మనుషుల సందర్శన ఆగిపోవడంతో కుక్కలను మనుషుల వద్దకు చేర్చాలని సంస్థ నిర్ణయించింది. అయితే కరోనా నేపథ్యంలో కుక్కలను దత్తత తీసుకోవడానికి ఎంత మంది ముందుకు వస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో బుష్ బీర్ అనే కంపెనీతో మిడ్ వెస్ట్ యానిమల్ రెస్క్యూ సంస్థ కలిసి వినూత్న దారిని ఎంచుకుంది. 

అదేంటంటే.. ఎవరైతే కుక్కను దత్తత తీసుకుంటారో వారికి మూడు నెలలకు సరిపడ బీర్‌ను బుష్ బీర్ కంపెనీ ఉచితంగా అందిస్తుంది. కుక్కను దత్తత తీసుకున్న వారు.. ప్రూఫ్ కింద కుక్కతో ఫొటో దిగి బుష్ బీర్ కంపెనీ ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలకు పంపించాల్సి ఉంటుంది. మొదటగా పంపించే వారికి 100 డాలర్ల రివార్డ్ కూడా ప్రకటించింది. కాగా.. ఈ కొత్త ఐడియాతో మిడ్ వెస్ట్ యానిమల్ రెస్క్యూ సంస్థ ముందు మనుషులు క్యూ కట్టారు. మరోపక్క ఈ కాంటెస్ట్ కేవలం మార్చి 25 నుంచి ఏప్రిల్ 25 వరకు మాత్రమే ఉండనున్నట్టు బుష్ బీర్ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఉన్న క్వారంటైన్ సమయంలో ఒక చేతిలో బీర్.. మరో చేతిలో పెంపుడు కుక్క ఉండటం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని బుష్ బీర్ యాజమాన్యం పేర్కొంది