భారత్ లో 40 కి చేరిన కోవిడ్ - 2019 (కరోనా ) పాజిటివ్ కేసులు

కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో తొలి కరోనా కేసు , దీంతో భారత్‌ వ్యాప్తంగా కోవిడ్‌-19 బారిన పడినవారి సంఖ్య 40కి చేరింది. ఇరాన్‌, దక్షిణ కొరియా వెళ్లొచ్చిన ఇద్దరు వ్యక్తులు జ్వరంతో బాధపడుతుండటంతో వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌ అని తేలగా.. మరొకరి మెడికల్‌ రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కాగా, కేరళలో ఆదివారం ఒక్కరోజే ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కేరళకు చెందిన ఓ కుటుంబం ఇటీవల ఇటలీ నుంచి వచ్చింది. వీరు ఎయిర్‌పోర్టులో అధికారులకు తప్పుడు సమాచారం అందించి, స్క్రీనింగ్‌ టెస్ట్‌ను తప్పించుకున్నారు. అప్పటికే వ్యాధి సోకిన వీరి ద్వారా మరో ఇద్దరికి కరోనా వైరస్‌ వ్యాపించడంతో కేరళలో బాధితుల సంఖ్య 5 అయింది. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్‌ బాధితుల సంఖ్య 39 అయింది. జమ్మూలో నమోదైన తాజా కేసుతో మొత్తం 40కి చేరింది. కాగా, నెల క్రితం కేరళలో మూడు కేసులు నమోదు కాగా, చికిత్స అనంతరం వారు కోలుకున్నారు. ఇదిలాఉండగా.. ప్రపంచాన్ని గడగడలాడిస్తు న్న కరోనా వైరస్‌తో చైనా తర్వాత తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో ఇటలీ చేరింది. అక్కడ 5,883 కేసులో నమోదు కాగా..233 మంది ప్రాణాలు విడిచారు.