హైదరాబాద్‌ నగర పోలీసుల ఆధ్వర్యంలో చార్మినార్‌ వద్ద 5కె, 2కె రన్ : హాజరైన హోం మంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి

షీ టీమ్స్‌, హైదరాబాద్‌ నగర పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం  మహిళా దినోత్సవం సందర్భంగా చార్మినార్‌ వద్ద 5కె, 2కె రన్ నిర్వహించారు.హోం మంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జెండా ఊపి మంత్రి పరుగును ప్రారంభించారు. టీ టీమ్స్‌ ఇన్‌ఛార్జి స్వాతి లక్రా, సినీ నటి అంజలి, ఎమ్మెల్యే పాషాఖాద్రి, మహిళా కానిస్టేబుళ్లు, యువతులు ఈ పరుగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. మహిళల్లో భరోసా కల్పించేందుకే షీ బృందాలను ఏర్పాటు చేశామని, షీ టీమ్స్‌ రాకతో మహిళలు అర్థరాత్రి కూడా ధైర్యంగా తిరుగుతున్నారని అన్నారు. పోలీసు శాఖలో 17 వేల పోస్టుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు హోంమంత్రి గుర్తు చేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌ నిరంతరం పనిచేస్తున్నాయని చెప్పారు. కమిషనర్ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. మహిళలకు షీ బృందాలు పూర్తి భద్రత కల్పిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్ల నుంచి షీ బృందాలు పనిచేస్తున్నాయని, మహిళలకు భద్రత కల్పించేందుకు షీ టీమ్స్‌ నిరంతరం పని చేస్తున్నాయని షీ టీమ్స్‌ ఇన్‌ఛార్జి స్వాతిలక్రా అన్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )