ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు దాడి : 7 మందిని కాల్చి చంపినా ఉగ్రవాదులు

ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న ఒక వేడుకపై దుండగులు ఉగ్రవాదులు దాడి చేసి 27 మందిని కాల్చి చంపారు. మరో 55 మందిని గాయపరిచారు. ఆఫ్ఘన్‌ నేత అబ్దుల్లా అబ్దుల్లా ఈ దాడి నుంచి స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికన్‌ సేనలను ఉపసంహరించుకునేందుకు తాలిబాన్లతో ట్రంప్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న తరువాత జరిగిన మొదటి అతి పెద్దదాడి ఇదే. ఈ దాడిలో తమ ప్రమేయం ఏమీ లేదంటూ తాలిబాన్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1995లో హత్యకావించ బడిన ప్రముఖ హజారా నేత అబ్దుల్‌ అలీ మజారీ వర్థంతి కార్యక్రమానికి ఆఫ్ఘన్‌ రాజకీయ నేత అబ్దుల్లా అబ్దుల్లా హాజరయ్యారు. గతేడాది ఇదే కార్యక్రమంపై ఉగ్రవాదులు పంజా విసిరి పలువురి ప్రాణాలు తోడేశారు. శుక్రవారం నాటి ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దాడి మానవత్వంపైన, ఆఫ్ఘనిస్తాన్‌ సమైక్యతపైన జరిగిన దాడిగా అధ్యక్షుడు అష్రఫ్‌ ఘని ట్వీట్‌ చేశారు. స్వల్పగాయాలతో బయటపడిన అబ్దుల్లా, ఆఫ్ఘన్‌ అధ్యక్ష పదవికి వరుసగా మూడు సార్లు పోటీ చేశారు. 2014 నుండి సంకీర్ణ ప్రభుత్వానికి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వర్తించ డంతో పాటు మాజీ విదేశాంగ మంత్రిగా కూడా వ్యవహరించారు. కాబూల్‌లో జరిగిన దాడిని ఆఫ్ఘనిస్తాన్‌ స్వతంత్ర మానవహక్కుల కమిషన్‌ చీఫ్‌ షార్జాద్‌ అక్బర్‌ తీవ్రంగా ఖండించారు.