ప్రపంచ స్థాయి కోర్సులను తీసుకురానున్న జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ హైదరాబాద్‌ ప్రపంచస్థాయిలో పేరుగాంచింది. సాంకేతిక విద్య అంటే జేఎన్‌టీయూ అన్నట్లుగా తయారైంది. ఎప్పటికప్పుడు మంచి నిర్ణయాలతో ముందుకు వస్తూ టెక్నాలజీ వాల్యూస్‌ను విద్యార్థుల్లో ఇనుమడింపజేస్తోంది. తాజాగా బీటెక్‌కు సంబంధించి ఈ విద్యాసంవత్సరం నుంచి అంటే 2020-21 నుంచే ఆరు కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని డైరెక్టొరేట్ ఆఫ్ అకాడెమిక్ మరియు ప్లానింగ్ భావిస్తోంది. కొత్త కోర్సులకు సంబంధించి జేఎన్‌టీయూ అనుబంధ కాలేజీల నుంచి ఏడు ప్రతిపాదనలు రాగా దీనిపై ఫిబ్రవరి 26న కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సూచనల మేరకు బీటెక్‌లో ఆరు కొత్త కోర్సులకు ఆమోద ముద్ర వేశారు జేఎన్‌టీయూ వైస్ ఛాన్సెలర్. ఇక ఈ ఆరు కొత్త కోర్సులు ఏంటంటే... ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషీన్ లెర్నింగ్, డాటా సైన్స్, ఎల్ఓటీ, నెటవర్క్స్ , కంప్యూటర్ ఇంజినీరింగ్, మరియు సైబర్ సెక్యూరిటీ. కొత్తగా కోర్సులు ప్రవేశపెట్టడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు తెలంగాణ టెక్నికల్ ఇన్స్‌టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బాలకృష్ణా రెడ్డి. అదే సమయంలో ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ కోర్సులను కూడా విస్మరించకూడదని చెప్పారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )