ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న గాంధీ సిబ్బంది : కరోనా వైరస్ పరీక్షలలో అలసత్వం

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న గాంధీ సిబ్బంది :  గాంధీ ఆస్పత్రిలో కరోనా టెస్టుల వ్యవహారంపై గందరగోళం నెలకొంది. రోజూ కరోనా అనుమానితులు గాంధీకి క్యూ కడుతున్న నేపథ్యంలో అక్కడి వైద్యులు నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ పరీక్షలు చేయగా వచ్చిన ఫలితాలకు, అవే నమూనాలతో పుణె వైరాలజీ నిపుణులు నిర్వహించిన పరీక్షల నివేదికకూ తేడా వస్తుండడం కలకలం రేపుతోంది. ఇద్దరు వ్యక్తులకు బుధవారం గాంధీ వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించగా ఇక్కడ పాజిటివ్ వచ్చింది. దీంతో దాన్ని ధ్రువీకరించుకొనేందుకు అవే నమూనాలను గాంధీ వైద్యులు పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ఆ ఫలితాల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. రెండు రోజులకు ఆ ఫలితాలు అందగా, వాటిలో కరోనా నెగటివ్ అని వచ్చింది. ఇదే విషయాన్ని గురువారం సాయంత్రం వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇలా ఇద్దరి నమూనాలు ఇక్కడ పరీక్షించగా పాజిటివ్ రావడం, పుణెలో పరీక్షించగా నెగటివ్ అని రావడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )