భారత్ లో మొదలైన కరోనా వైరస్ మారణకాండ ... తొలి మృతి నమోడు


కరోనా వైరస్ భారత్‌లో మారణకాండ మొదలైంది . తాజాగా మరో ఐదుగురు ఈ వ్యాధి బారిన పడ్డంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 62కు చేరింది. వీరిలో 16 మంది ఇటాలియన్లు ఉన్నారు. అలాగే, తొలి కరోనా అనుమానిత మరణం కూడా చోటుచేసుకుంది. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్‌ హుస్సేస్‌ సిద్ధిఖీ(76) కరోనా లక్షణాలతో బుధవారం రాత్రి చనిపోయాడు. మహ్మద్ ఇటీవలే మక్కా, మదీనా యాత్ర కోసం సౌదీ అరేబియా వెళ్లి స్వదేశానికి చేరుకున్నాడు. సొంతగడ్డపై అడుగుపెట్టగానే తీవ్ర దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడిన ఆయనను కలబుర్గి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. అతని బ్లడ్ శాంపిళ్లను బెంగళూరు ల్యాబ్‌కు పంపించామని, రిపోర్టులు ఇంకా రాలేదని వైద్యులు తెలిపారు. కరోనా వ్యాధిని నిర్ధారించడానికి వైద్యులు రెండుసార్లు పరీక్షలు జరుపుతున్నారు. కేరళలో కొందరు ఈ వైరస్ బారిన పడి కోలుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.