కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతున్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు

అమెరికా దేశంలో కోవిడ్ - 2019 మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. వీరంతా వాషింగ్టన్‌ రాష్ట్రానికి చెందినవారే. మరోవైపు బాధితుల సంఖ్య 100 దాటినట్టు అధికారులు తెలిపారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మరోవైపు చైనాలో కొత్తగా వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. మంగళవారం 115 మందికి కొవిడ్‌ సోకినట్టు గుర్తించారు. మరో 38 మంది మరణించడంతో మృతుల సంఖ్య 2,981కి చేరింది. ఇక దక్షిణకొరియాలో 142 మంది కొత్తవారికి వైరస్‌ సంక్రమించినట్టు ధ్రువీకరించారు. కరోనాకు సులువుగా దొరికిపోతున్న అమెరికన్‌ ఉద్యోగులు అమెరికాలో అందుబాటులో లేని ఆరోగ్య పరిరక్షణా వ్యయం, చాలీ చాలని వేతనాలతో అక్కడి ఉద్యోగులు కరోనా వైరస్‌కు సులువుగా దొరికిపోతున్నారని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం కరోనా బారిన పడి మరో ఇద్దరు మరణించడంతో అమెరికాలో కరోనా మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ మరణాలన్నీ సియాటెల్‌ వాషింగ్టన్‌ నగర శివార్లలోని కిర్క్‌లాండ్‌ వంటి ప్రాంతాలలో నమోదయినవే. ప్రస్తుతం దాదాపు డజనుకు పైగా రాష్ట్రాల్లో 115కు పైగా తాజా కేసులు నమోదయ్యాయి. అయితే ట్రంప్‌ సర్కారు ప్రజారోగ్యాన్ని, ఉద్యోగుల ఆరోగ్యాన్ని పక్కన పెట్టి స్టాక్‌మార్కెట్‌పై దీని దుష్ప్రభావం పట్ల ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే విషయంలో అమెరికన్‌ సమాజం సన్నద్ధతను ఇది మన కళ్లకు కడుతోంది.