కోహ్లి, నువ్వు గుండు కొట్టించుకో: వార్న‌ర్‌

ప్ర‌పంచాన్ని మింగేయాల‌ని చూస్తున్న‌ క‌రోనా ర‌క్క‌సిని ఎదిరించేందుకు ఎంతోమంది అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌ట్లేదు. ప్ర‌జ‌లను క‌రోనా బారి నుంచి కాపాడేందుకు రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తూ, కంటికి క‌నిపించ‌ని మ‌హమ్మారితో అనునిత్యం యుద్ధం చేస్తున్నారు. వైద్యులు, పారామెడిక‌ల్ సిబ్బంది, పోలీసులు.. ఇలా ఎంద‌రో మ‌న‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా అడ్డు నిలుస్తున్నారు. వీరంద‌రికీ మ‌ద్ద‌తు తెలుపుతూ ఆస్ట్రేలియ‌న్ స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్న‌ర్‌ వినూత్న చాలెంజ్‌ను ఆవిష్క‌రించాడు. వారి పోరాటాన్ని కీర్తిస్తూ ఈ క్రికెట‌ర్ గుండు గీసుకున్నాడు. (మంచి మనసు చాటుకున్న వార్నర్‌)

ట్రిమ్మ‌ర్ స‌హాయంతో స్వతాహాగా గుండు గీసుకుంటున్న వీడియోను ఈ ఆసీస్‌ ఓపెనర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాక‌ భార‌త క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్‌తో పాటు మ‌రో ఏడుగురిని ఈ స‌వాలు స్వీక‌రించాల్సిందిగా కోరాడు. అస‌లే జుట్టుతో ఎన్నో ప్ర‌యోగాలు చేసే విరాట్ ఈ చాలెంజ్ స్వీక‌రిస్తాడో లేదో చూడాలి. కాగా క‌రోనా వ్యాప్తిని నివారించేందుకు అవ‌గాహ‌న క‌ల్పించే "సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్" ఈమ‌ధ్య బాగా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా ఆస్ట్రేలియాలో ఇప్ప‌టివ‌ర‌కు 4 వేల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదవ‌గా, 19 మంది మృతి చెందారు