అప్పుల కుప్పగా తెలంగాణ : ఈ సారి కూడా బడ్జెట్ పెంచి అప్పులతో సర్దాలనే యోచనలో తెలంగాణ సర్కార్

తెలంగాణ రాష్ట్రంలో  వచ్చే ఆర్థికసంవత్సరం (2020–21) రూ.1.6 లక్షల కోట్ల మేర అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లెక్కలేస్తున్నట్లు తెలుస్తుంది.  మునుపటి సంవత్సర బడ్జెట్ కి  10 శాతానికి పెంపు  అనుగుణంగా 2019–20 బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.1.46 లక్షల కోట్లకు అదనంగా మరో 12–16 వేల కోట్లు కలిపి 2020–21 బడ్జెట్‌ తయారీ కోసం ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. అయితే రూ.1.65 లక్షల కోట్ల అంచనాతో ఈసారి బడ్జెట్‌కు తుదిరూపు ఇస్తున్నారనే చర్చ జరిగినా, కరోనా వైరస్‌ ప్రభా వం దేశీయ మార్కెట్లపై ఉండటం, ఆ మేర పన్నురాబడులపై ప్రభావం ఉం టుందనే అంచనా, వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం వరకు ఆర్థిక మాంద్యం ప్రభావం ఉండే అవకాశాలున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్‌ అంచనాలు రూ.1.6 లక్షల కోట్ల వరకు ఉం టాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.సాగునీటి రంగానికి రూ.10 వేల కోట్ల లోపే బడ్జెట్‌ కేటాయింపులుంటాయని తెలుస్తోంది. వీటికి అదనంగా అప్పులు కలిపి రూ.23 వేల కోట్ల వరకు ప్రతిపాదనలుండే అవకాశాలున్నాయి. సాగునీటి రంగంతో పాటు రైతు రుణమాఫీకి రూ.10 వేల కోట్ల వరకు కేటాయించనున్నట్లు సమా చారం. రైతు రుణమాఫీకి రూ.24 వేల కోట్లు అవసరం అవుతాయని బ్యాంకులు అంచనా వేయగా, 2019–20లో కేటాయించిన రూ.6 వేల కోట్లకు అదనంగా  మరో రూ.18 వేల కోట్లు ఈసారి బడ్జెట్‌లోనే కేటాయించి ఈ ఏడాది పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే, ఆర్థిక  పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈసారి రూ.6వేల కోట్లు కేటాయించి ఈ ఏడాది నుంచి రుణమాఫీ అమలు  ప్రారంభించాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.57 ఏళ్లకు కుదించిన వయసు ఆధారంగా అర్హులైన కొత్త పింఛన్‌దారులకు పెన్షన్‌ కింద రూ.12 వేల కోట్లు, జీతభత్యాలు, సబ్సిడీలు, వడ్డీలకు కలిపి రూ.47 వేల కోట్లు కేటాయింపులు అవసరం అవుతాయి. వీటితో పాటు పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలకు రూ.7,300 కోట్లు, రూ.10 వేల కోట్లు విద్యుత్‌రాయితీలు ప్రతిపాదించి మిగిలిన మొత్తాన్ని ఉపకార వేతనాలు, ఆరోగ్యశ్రీ, కల్యాణ లక్ష్మి, విద్య, సంక్షేమం, హోం శాఖలకు కేటాయించేలా బడ్జెట్‌ కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి కేసీఆర్‌ ఆపద్బంధు, కుట్టు మిషన్ల పంపిణీ పథకాలకు మాత్రమే కొత్తగా నిధులుంటాయని, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, నిరుద్యోగ భృతి లాంటి జోలికి ప్రభుత్వం వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. కాగా, ఈ బడ్జెట్‌ను ఈనెల 8న అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )