సాధారనంగ జరిగిన చరన్ బర్త్‌డే


ఈ రోజు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ బర్త్‌డే. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే తన బర్త్‌డే వేడుకలను సాదాసీదాగా జరుపుకున్నాడు చెర్రీ.  సెల్ఫ్‌ ఐసోలేషన్‌ కారణంగా ఎవరు కూడా తనను కలవడానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ఇంట్లోనే ఉండాలని.. అభిమానులు, సన్నిహితులు అదే తనకు ఇచ్చే గొప్ప బహుమతని చరణ్‌ పేర్కొన్నారు. దీంతో మెగా కుటుంబ సభ్యులెవరూ కూడా స్వయంగా చరణ్‌ ఇంటికి వెళ్లి విష్‌ చేయలేదు. టాలీవుడ్‌ ప్రముఖులు, అభిమానులతో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా సోషల్‌ మీడియా వేదికగానే చెర్రీకి బర్త్‌డే విషెస్‌ తెలిపారు. కాగా, తన భర్త చరణ్‌ బర్త్‌డే సందర్భంగా ఉపాసన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. 

స్వయంగా ఉపాసననే తన స్వహస్తాలతో తయారు చేసి కేక్‌ను చరణ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. రెండు విభిన్న కేకులను తయారు చేసిన ఉపాసన వాటిపై పండ్లతో ‘ఆర్‌సి’అని రాశారు. ఆ కేకును చరణ్‌ కట్‌ చేసి బర్త్‌డే వేడుకలను జరుపుకున్నాడు. ఈ సందర్భంగా చరణ్‌ కేక్‌ కట్‌ చేస్తున్న ఫోటోలను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా, తాను తయారు చేసిన కేక్‌కు సంబంధించిన వివరాలను వీడియోగా రూపొందించి తన యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు ఉపాసన పేర్కొన్నారు.  

ఇక రామ్‌చరణ్‌ బర్త్‌డే సందర్భంగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ పేరుతో ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్‌చరణ్‌ లుక్‌ను, తన క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. ఇక రామరాజు గురించి చెబుతూ భీమ్‌(ఎన్టీఆర్‌) అందించి వాయిస్‌ ఓవర్‌ సూపర్బ్‌గా నిలిచిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో తెలంగాణ గొండు వీరుడు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే