విదేశీయులకు ఇక ఇండియాలోకి నో ఎంట్రీ ..


ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది .  భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 వరకు అన్ని టూరిస్ట్ వీసాలను సస్పెండ్కి ఆదేశాలు జారీ చేసింది . ఈ నిబంధన మార్చి 13వ తేదీ నుంచి అమలులోకి రానుంది. అధికారిక వీసాలు, డిప్లొమాటిక్ వీసాలు, ఐరాస సంస్థల ప్రతినిధులకు సంబంధించిన వీసాలు.. ఇలా పలు రకాల వీసాలన్నింటిని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో మంత్రుల కమిటీ సమావేశమై కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఈ నిర్ణయానికి వచ్చారు. అటు ఫిబ్రవరి 15 తర్వాత చైనా, ఇటలీ, ఇరాన్, కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీల నుంచి వచ్చిన విదేశీయులపై ప్రత్యేక దృష్టి సారించాలని.. తప్పనిసరిగా 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చే భారతీయులకు స్క్రీనింగ్ నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో ఇప్పటివరకు 62 కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలోని వుహాన్‌లో మొదలైన ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 110 దేశాలకు వ్యాపించింది. కాగా, ఈ కోవిడ్ 19 కారణంగా సుమారు 4 వేల మందిపైగా ప్రాణాలు విడిచారు.