హైదరాబాద్ మెట్రో కి కేంద్రం ఇంకా నిధులు పూర్తిగా ఇవ్వలేదు : కేటీఆర్


తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 10శాతం  నిధులనే చెల్లిస్తున్నదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. వాటిలో కూడా ఇంకా రూ.290 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. మెట్రో రైళ్లల్లో రోజుకు నాలుగు లక్షల మంది ప్రయాణిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య పద్ధతి(పీపీపీ)లో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు.. ప్రపంచంలోనే అతి పెద్దదని చెప్పారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంఐఎం సభ్యుడు జాఫర్‌ హుస్సేన్‌, టీఆర్‌ఎస్‌ సభ్యులు కెపి వివేకానందగౌడ్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఇందుకోసం మత సంబంధ ఆస్తులను సేకరించాల్సి ఉందనీ, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వీటిపై చర్చిస్తామని తెలిపారు. మెట్రో రైళ్లలో రోజువారీ ప్రయాణించే వారికి పాసులిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నదనీ, సంబంధిత డీపీఆర్‌ పరిశీలనలో ఉందని మంత్రి వివరించారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.