రగులుతున్న ఆంధ్ర రాజకీయాలు : పెట్రేగుతున్న హత్య ప్రయత్నాలు


ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, అధికార ప్రతినిధి బొండా ఉమామహేశ్వరరావు, న్యాయవాది కిశోర్‌లను హత్య చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మాచర్లలో పై ముగ్గురిపై వైసీపీ నేతల దాడి ఘటన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. పల్నాడులోనే కాదు, రాష్ట్రమంతా ఇలాగే జరుగుతోందన్నారు. కశ్మీర్‌, బిహారుల్లో కూడా ఇలాంటి దుర్మార్గాలు చూడలేదన్నారు. పరిస్థితులు ఇలా ఉంటే డీజీపీ ఏం చేస్తున్నారని నిలదీశారు. "మాచర్లలో దాడి జరగకముందే గుంటూరు ఎస్పీతో మాట్లాడాను. మాచర్లలో చాలా దారుణంగా ఉంది. నామినేషన్లు లేవు.. మీరు చర్యలు తీసుకోవాలని చెప్పాను. కానీ ఆయనేం చర్యలు తీసుకోలేదు. ఆయనతో మాట్లాడిన రెండు గంటలకే దాడి జరిగింది. కనీసం అప్పుడైనా ఫోన్‌చేసి.. ఇలా జరిగినందుకు బాధపడుతున్నాను.. రక్షణ కల్పిస్తానని కూడా చెప్పలేదు. రెండు, మూడు సార్లు ఫోన్‌ చేస్తే తప్ప లైన్‌లోకి రాలేదు. మరోవైపు డీజీపీకి కూడా ఫిర్యాదు చేశాం.