పల్లెల నుండి పట్టణాల ప్రజా రవాణాకు ప్రపంచ బ్యాంకు రుణాలు


ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ అత్యంత వేగంగా పెరుగుతోంది.అదే సమయంలో , పెరుగుతున్న జనాభాకు వీలుగా ఆయా ప్రాంతాల్లో ప్రజా రవాణా విస్తరించటం లేదని  ప్రపంచ బ్యాంకు ప్రత్యేక అధ్యయనాలతో తేల్చింది. దీన్ని మార్చాలంటే పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణాను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మన దేశంతో కూడా అవగాహనకు వచ్చింది. కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆధ్వర్యంలో ఈ బృహత్‌ ప్రాజెక్టును చేపట్టబోతోంది. ఇందుకు సంబంధించి తన వంతుగా సాంకేతిక సహకారాన్ని ఉచితంగా అందించటంతో పాటు కేంద్రానికి అవసరమైన కొంత ఆర్థిక చేయూతను అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు వచ్చే ఐదేళ్లలో పట్టణ ప్రజా రవాణా రూపురేఖలు మార్చాలన్నది ప్రణాళిక. ఇందుకు ఐదేళ్ల కాలానికి రూ.75 వేల కోట్లు ఖర్చవుతాయని ఓ అంచనా. దీనికి కేంద్రం కూడా సానుకూలంగా ఉండి, రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి తాజాగా ఢిల్లీలో ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ప్రాజెక్టు వివరాలు వెల్లడించింది. ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసేందుకు మహారాష్ట్ర, ఏపీలను ఎంపిక చేసి, మిగతా రాష్ట్రాలు సమ్మతిని తెలపాల్సిందిగా కేంద్రం కోరింది. ప్రాజెక్టులో చేరేందుకు ఉన్న అభ్యంతరాలను తెలపాల్సిందిగా సూచించింది. ఈ సమావేశానికి టీఎస్‌ఆర్టీసీ తరుఫున పలువురు హాజరయ్యారు. దీనిపై కేంద్రానికి తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )