త్వరలో పార్టీ పెట్టనున్న రజినీకాంత్ : ఈరోజే చెన్నైలో నేతలతో కీలక మీటింగ్


రజనీకాంత్‌ గురువారం మరోసారి రజనీ ప్రజా సంఘం రాష్ట్రవ్యాప్త కార్యదర్శులతో భేటీ కానున్నారు. ఈయన రాజకీయాల్లోకి వస్తున్నానని బహిరంగంగా చెప్పి రెండేళ్లు దాటింది. అప్పటి నుంచి ఆయన అభిమానుల హడావుడి మినహా రాజకీయ పార్టీని ప్రకటించిందిలేదు. రజనీకాంత్‌ కంటే కాస్త వెనుక తానూ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన ఆయన సహ నటుడు కమలహాసన్‌ పార్టీని నెలకొల్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను పోటీ చేయించారు. ఆశాజనకమైన ఓట్లను సంపాదించుకున్నారు. నటుడు రజనీకాంత్‌ మాత్రం ఇప్పటికీ పార్టీని ప్రకటించలేదు. అయితే తాజాగా ఆయన రాజకీయపరంగా వేగాన్ని పెంచారని చెప్పాలి. గతవారం రాష్ట్రవ్యాప్త రజనీ ప్రజాసంఘం కార్యదర్శులను చెన్నైకి రప్పించి వారితో భేటీ అయ్యారు. దీంతో రజనీకాంత్‌ రాజకీయ పార్టీని ప్రారంభించడం ఖాయం అని చాలామంది అనుకున్నారు. రాజకీయ వర్గాల్లోనూ కదలిక వచ్చింది. కార్యదర్శుల భేటీ అనంతరం రజనీకాంత్‌ చేసే ప్రకటనపై ఆసక్తిగా ఎదురుచూశారు.