సైబర్‌ సెక్యూరిటీ సేవల కోసం ఉస్మానియా యూనివర్సిటీ తో కలిసి పనిచేయనున్న తెలంగాణ పోలీసులు

తెలంగాణ  రాష్ట్ర పోలీసు విభాగం ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్‌ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ సైబర్‌ లా(సీసీఎస్‌సీఎల్‌) తో అవగాహన  ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అవగాహన ఒప్పందంపై తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి సంతకాలు చేశారు. పోలీసులకు కొన్ని ప్రత్యేక అంశాలపై శిక్షణనిచ్చి, సర్టిఫికెట్‌ అందించేందుకు ప్రత్యేక కోర్సును రూపొందించాలని ఓయూ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీజీపీ జితేందర్‌, అడిషనల్‌ డీసీపీ శ్రీనాథ్‌రెడ్డి, ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్‌ రామచంద్రం, ఓఎస్డీ ప్రొఫెసర్‌ కృష్ణారావు, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, ఓయూ ఈసీ సభ్యుడు ప్రొఫెసర్‌ ఎం.కుమార్‌, ఇంజినీరింగ్‌ విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ పీవీఎన్‌ప్రసాద్‌, యూఎఫ్‌ఆర్‌వో డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జీబీరెడ్డి, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం హెడ్‌ ప్రొఫెసర్‌ సుధా, కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాంవెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇరువర్గాలకు కెపాసిటీ బిల్డింగ్‌కు ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. సైబర్‌ నేరాలను గుర్తించేందుకు, సైబర్‌ చట్టాలకు సం బంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు, సైబర్‌ భద్రతా ప్రమాణాల గురించి ఇరువర్గాలకు దీంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )