నిర్భయ నిందితులకు మరోమారు ఉరిశిక్ష వాయిదా

 నిర్భయ హత్యాచారం, హత్య కేసు దోషులకు ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడింది. ఢిల్లీ కోర్టు నలుగురు దోషుల ఉరిశిక్ష అమలు తేదీని వాయిదా వేసింది. తన క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్షను వాయిదా వేయాలని పవన్ గుప్తా వేసిన పిటిషన్ పై సోమవారం వాదనలు విన్న ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. తదుపరి ఆదేశాల వరకు నిర్భయ దోషులను ఉరితీయకూడదని తీహార్ జైలు అధికారులను అదనపు సేషన్ జడ్జి ధర్మేందర్ రానా ఆదేశించారు. అలాగే, ఈ రోజు ఉదయం పవన్ గుప్తా క్యూరేటివ్ పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. కాగా, మంగళవారం ఉదయం 6 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా, ఆఖరి గంటల్లో ఢిల్లీ కోర్టు స్టే విధించింది. దీంతో నిర్భయ దోషులకు ఉరి మరోసారి వాయిదా పడింది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )