కరోనా కారణంగా ఐపీల్ నుండి తప్పుకున్న ఇంగ్లాండ్ క్రికెటర్ క్రిస్‌వోక్స్‌

ఐపీఎల్‌ 13వ సీజన్‌ నుంచి ఇంగ్లాండ్‌ పేసర్‌ క్రిస్‌వోక్స్‌ కరోనా వైరస్ కారణంగా  తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 19న కోల్‌కతాలో జరిగిన ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో దిల్లీ క్యాపిటల్స్‌ అతడిని రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, జూన్‌ 4 నుంచి ఇంగ్లాండ్‌ రెండు టెస్టు సిరీసుల్లో ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తొలుత శ్రీలంకతో, తర్వాత వెస్టిండీస్‌తో మూడేసి మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలోనే ఆ టెస్టు సిరీసుల్లో రాణించేందుకు వోక్స్‌ ఐపీఎల్‌ నుంచి తప్పుకొన్నట్లు సమాచారం.ఈనెల 29న జరిగే ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ ఢీకొననున్నాయి. 30న దిల్లీ క్యాపిటల్స్‌, కింగ్స్‌ XI పంజాబ్‌తో తలపడనుంది. కాగా, దిల్లీ తుది జట్టులో వోక్స్‌కు చోటు దక్కుతుందా? లేదా అనేది పక్కనపెడితే.. ఆ జట్టుకు మాత్రం ఇబ్బందే. ప్రధాన పేసర్‌ ఇషాంత్‌ శర్మ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేని పరిస్థితిలో.. టోర్నీ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదనిపిస్తోంది. ఇదివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు ఆడిన ఈ ఇంగ్లాండ్‌ పేసర్‌ 2017లో 17 వికెట్లతో రాణించాడు. 2018లో ఎక్కువ పరుగులివ్వడంతో అతడు 5 మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు.