తెలంగాణ భవన్‌లో డీసీసీబీ చైర్మెన్లు, వైస్‌ చైర్మెన్లతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు భేటీ

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా ఆర్థిక లోటు ఏర్పడుతోంది అని , టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావుఅన్నారు . అయినప్పటికీ రైతు రుణమాఫీని అమలు చేసి తీరతామని ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలంటూ అధికారులను సీఎం ఆదేశించారని తెలిపారు. రైతులను సంఘటితం చేయాల్సిన బాధ్యతంతా నూతనంగా ఎన్నికైన డీసీసీబీ చైర్మెన్లు, వైస్‌ చైర్మెన్లదేనని అన్నారు. వారితో మమేకం కావాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో డీసీసీబీ చైర్మెన్లు, వైస్‌ చైర్మెన్లతో ఆయన భేటీ అయ్యారు. పలువురు మంత్రులు హాజరైన ఈ కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ... సహకార ఎన్నికలను ఒక సవాలుగా తీసుకుని భారీ విజయాన్ని సాధించి పెట్టిన నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. చైర్మెన్ల ఎంపికలో 48 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించామని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి రిజర్వేషన్లు లేకున్నా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని... బడుగు, బలహీన వర్గాల వారికి అవకాశం కల్పించారని చెప్పారు. తద్వారా అసలైన సామాజిక న్యాయాన్ని అమలు చేసి చూపించారని అన్నారు. పురపాలక ఎన్నికల్లోనూ నిర్దారిత రిజర్వేషన్ల కన్నా ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకే పెద్ద పీట వేశామని తెలిపారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని కేటీఆర్‌ ఈ సందర్భంగా చెప్పారు. అందుకే వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నామని అన్నారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )