ప్రపంచ వ్యాధిగా కరోనా వైరస్ ని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)


ప్రపంచ వ్యాప్తంగా వందకుపైగా దేశాల్లో వేగంగా విస్తరించిన కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)ను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) బుధవారం ప్రకటించింది. పలు దేశాలు ఈ వ్యాధి నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రెస్‌ అధానొమ్‌ గెబ్రియేసుస్‌ బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. చైనా వెలుపల కరోనా కేసులు 13 రెట్లు పెరిగాయన్నారు. సత్వర చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు ఆయన సూచించారు. ప్రజలు గుంపులు గుంపులుగా చేరే చోట వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్నారు. దీనిపై ఆయా దేశాలు దృష్టి పెట్టాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. మానవ జీవితాన్ని గౌరవిస్తూ, ఈ మహమ్మారిని ఆపే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న కరోనా కేసుల దృష్ట్యా మరణాలు పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనాను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రకటించడంతో ఇన్సూరెన్స్‌ కవరేజీ వర్తించదు.