ప్రజల బ్యాంకు ఖాతాలలో రూ.36,659 కోట్లు జమ చేసిన భారత ప్రభుత్వం


న్యూఢిల్లీ : కరోనా వైరస్ పై పోరాటం నేపథ్యంలో దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం అమలవుతుండటంతో నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 17 మధ్య కాలంలో 16.01 కోట్ల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.36,659 కోట్లు బదిలీ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో రూ.36,659 కోట్లకు పైగా బదిలీ చేసినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 16.01 కోట్ల మంది లబ్ధి పొందారని వివరించింది.  ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన క్రింద రూ.500 చొప్పున మహిళల జన్ ధన్ ఖాతాలకు జమ చేసినట్లు తెలిపింది. ఈ పథకం క్రింద 19.86 కోట్ల మంది లబ్ధి పొందారని, వీరందరికీ మొత్తం రూ.9,930 కోట్లు జమ చేశామని తెలిపింది.