జియో లో 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఫేస్బుక్


ముంబయి: రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్‌ పెట్టుబడులు కరోనా సంక్షోభం తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ప్రాముఖ్యతకు బలమైన సంకేతంగా అభివర్ణించారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌, జియోలో వాటా కొనుగోలుపై ఆయన ముకేశ్‌ అంబానీకి అభినందనలు తెలిపారు. ''ఫేస్‌బుక్‌తో జియో ఒప్పందం ఆ రెండు సంస్థలకు మాత్రమే లాభదాయకం కాదు. సంక్షోభంలో ఈ ఒప్పందం కుదిరినప్పటికి, కరోనా సంక్షోభం తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ప్రాముఖ్యతకు ఇది బలమైన సంకేతం. ప్రపంచం మొత్తానికి భారత్‌ అభివృద్ధి కేంద్రంగా మారుతుందనే వాదనను ఇది బలపరుస్తుంది. ముకేశ్‌ గొప్పగా చేశావ్ '' అని మహీంద్రా ట్విటర్లో పేర్కొన్నారు.
జియోలో ఫేస్‌బుక్‌ వాటా కొనుగోలు విదేశి పెట్టుబడుల్లోనే అతి పెద్దది. దీని ద్వారా ఫేస్‌బుక్‌, జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటా కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ పెట్టుబడుల విలువ రూ.43,574 కోట్లు. జియో-ఫేస్‌బుక్‌ ఒప్పందం గురించి ముకేశ్‌ అంబానీ మాట్లాడుతూ, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌తో మా భాగస్వామ్యం ద్వారా భారత్‌లోని అన్ని డిజిటల్‌ సేవల్లో కొత్త మార్పులు తీసుకొచ్చి, మరింత మెరుగ్గా భారతీయులకు సేవలందించడమే మా లక్ష్యం అని తెలిపారు. జియోతో కలిసి పనిచేయడం ద్వారా భారత్‌లో ప్రజలకు, చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు మరింత సమర్థవంతంగా పనిచేసేలా మార్గాలు రూపొందించనున్నాం అని ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ అన్నారు.