అమెరికా లో కరోనా రోగులకి క్రిమి సంహారక రసాయనాలు తాగించారని ఊహాగానాలు

కరోనా రోగులకి క్రిమి సంహారక రసాయనాలు తాగించాలని, వారి ఊపిరితిత్తుల్లోకి యూవీ కిరణాలు జొప్పించాలంటూ వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు పాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శనివారం మీడియా సమావేశంలో పాల్గొనలేదు. మీడియా సమావేశాలతో ఉపయోగం లేదని, విలువైన సమయాన్ని వెచ్చించే స్థాయిలో అవి లేవని ట్వీట్‌ చేశారు. ‘ఒక వర్గం మీడియా అన్నీ వ్యతిరేక ప్రశ్నలే వేస్తుంది. వాస్తవాల్ని దాచిపెట్టి వాళ్లకి ఇష్టం వచ్చినట్టుగా రాస్తుంది. దీనివల్ల ఏం ప్రయోజనం, మీడియాకి రేటింగ్స్‌ వస్తున్నాయి. అమెరికా ప్రజలు తప్పుడు వార్తల్ని వింటున్నారు. ఇలాంటి వాటి కోసం ఈ సంక్షోభ సమయంలో విలువైన సమయాన్ని కేటాయించలేను’అని ట్రంప్‌ పేర్కొన్నారు. క్రిమిసంహారకాలపై వ్యాఖ్యలతో నవ్వులపాలైన ట్రంప్‌ కొన్నాళ్లు మీడియాకి దూరంగా ఉండడం మంచిదని భావిస్తున్నట్లు సమాచారం.

అమెరికాలో కోవిడ్‌ మృత్యుఘోష వినిపిస్తూనే ఉంది. జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ వివరాల ప్రకారం 24 గంటల్లో 2,494 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులు గణనీయంగా తగ్గు ముఖం పట్టాయి. గత మూడు వారాల్లో అత్యంత తక్కువగా 24 గంటల్లో 1,258 మరణాలు నమోదయ్యాయి. మరో వైపు స్పెయిన్‌లో గత అయిదు వారాల్లోనే అత్యంత తక్కువగా మరణాలు నమోదయ్యాయి. ఆదివారం 288 మంది మరణించారు.