ఆఫ్రిదిపై మరోసారి విరుచుకుపడ్డ మాజీ ఆటగాడు

టీమిండియా మాజీ  ఆటగాడు గౌతమ్ గంభీర్ మ‌రోసారి ఆఫ్రిదిపై విరుచుకుప‌డ్డాడు. ఈ మ‌ధ్య‌నే గంభీర్‌కు వ్య‌క్తిత్వం లేదంటూ ఆఫ్రిది ఘాటైన వ్యాఖ్య‌లు చేశాడు. 'గంభీర్​ ప్రవర్తనలో సమస్య ఉంది. అతడికి వ్యక్తిత్వం లేదు. రికార్డులు లేవు, కానీ  ఆటిట్యూడ్ మాత్రం చాలా  ఉంది” అంటూ  ట్విట‌ర్ వేదిక‌గా మండిప‌డ్డాడు. దీనికి బ‌దులుగా శ‌నివారం ట్విట‌ర్ వేదిక‌గా గౌత‌మ్ గంభీర్ ఆఫ్రిదికి  త‌నదైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చాడు.    'అస‌లు వయసు గుర్తుంచుకోలేని ఓ వ్యక్తి(ఆఫ్రిది)కి నా రికార్డులెలా గుర్తుంటాయి. షాహిద్ ఆఫ్రిది నీకు ఓ విషయం గుర్తు చేస్తున్నా. 2007 ప్రపంచకప్​(టీ20) ఫైనల్​లో భారత్‌, పాకిస్తాన్ మ‌ధ్య‌​ మ్యాచ్ జ‌రిగింది. ఆ మ్యాచ్‌లో  గంభీర్​ 54బంతుల్లో 75పరుగులు చేశాడు. కానీ ఆఫ్రిది మాత్రం  మొదటి బంతికే  డకౌట్ అయ్యాడు. మ‌రో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మేం కప్పు గెలిచాం. అది గుర్తుపెట్టుకో. నీలాంటి అబద్ధాల కోరు, మోసగాళ్లు, అవకాశవాదుల పట్ల నా ప్రవర్తన దురుసుగానే ఉంటుంది' అంటూ  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.  2007టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఆల్‌రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ నిలిచినా గౌత‌మ్ గంభీర్ చేసిన 75 ప‌రుగుల ఇన్నింగ్స్‌ను అంత తేలిక‌గా ఎవ‌రు మ‌రిచిపోలేరు. ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉత్కంఠంగా సాగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆఖ‌రి బంతికి కానీ తుది ఫ‌లితం తేల‌లేదు. జోగింద‌ర్ శ‌ర్మ వేసిన ఆఖ‌రి ఓవ‌ర్‌లో అంత‌వ‌ర‌కు పాక్ జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు తీసుకొచ్చిన మిస్బా -ఉల్- హ‌క్ చివ‌ర్లో ఒత్తిడికి లోన‌య్యాడు. జోగి వేసిన ఆఖ‌రి బంతిని మిస్బా  అప్ప‌ర్ క‌ట్ చేయ‌గా గాల్లోకి ఎగిరిన బంతి బౌండ‌రీ లైన్ వ‌ద్ద శ్రీశాంత్ చేతిలో ప‌డ‌డంతో టీమిండియా తొలిసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో జ‌గ‌జ్జేత‌గా నిలిచింది.