ఆ అట్టపెట్టెలో ఎం ఉందంటే?...48 మిలియన్ల వ్యూస్‌

తన పుట్టిన రోజు నాడు స్నేహితుడు ఇచ్చిన గిఫ్ట్‌ చూసి సర్‌ప్రైజ్‌ అవ్వటమే కాదు.. సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడతను. అతడి ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఎదుటి వ్యక్తి ఇచ్చిన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అలాంటిది మరి. అంతలా సంతోష పెట్టే గిఫ్ట్‌ ఏమిచ్చాడా అని ఆలోచిస్తున్నారా. ఏం లేదు.. సంవత్సరం పాటు దూరంగా ఉన్న స్నేహితుడ్ని కానుక రూపంలో కలుసుకోవటమే.
 ఓ వ్యక్తి అట్టపెట్టె పక్కన నిల్చుని ఉన్నాడు. అంత పెద్ద అట్టపెట్టలో తనకు వచ్చిన గిఫ్ట్‌ ఏంటా అని ఆలోచిస్తూనే దాన్ని తెరిచాడు. కానుక రూపంలో ఉన్న స్నేహితుడ్ని చూసే సరికి ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. 
క్షణాల్లో తేరుకుని, సంవత్సరం పాటు స్నేహితుడికి దూరంగా ఉండి, పుట్టినరోజు నాడు అతడ్ని చూసిన సంతోషంలో బర్త్‌డే బాయ్‌ ఉక్కిరిబిక్కిరై.. ఎదుటి వ్యక్తిని బాహువులలో బంధించి ఉక్కిరి బిక్కిరి చేశాడు. 2019 నవంబర్‌లో విడుదలైన 20 సెకన్ల ఈ టిక్‌టాక్‌ వీడియోకు 48 మిలియన్ల వ్యూస్‌, 8.5మిలియన్ల లైక్స్‌ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియోను రెడ్డిట్‌లో మళ్లీ విడుదల చేయగా మరోసారి వైరల్‌గా మారింది.