తెలంగాణలో విజృంభించిన కరోనా కేసులు : గురువారం ఒక్కరోజే 50 పాజిటివ్‌ కేసులు నమోదు


తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 50 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఇవాళ్టి కొత్త కేసులన్ని గ్రేటర్ పరిధిలోనే నమోదు అయినట్లు చెప్పారు. ఇప్పటివరకూ తెలంగాణ 700 కేసులు నమోదు కాగా, 18మంది మృతి చెందినట్లు మంత్రి ఈటెల తెలిపారు. ఇప్పటివరకూ కరోనా బారిన పడి కోలుకుని 186మంది డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొన్నారు. ఇవాళ 68మంది డిశ్చార్జ్‌ కాగా, ఎవరూ చనిపోలేదన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయినా లాక్‌డౌన్‌పై మొదట ప్రకటన చేసింది తెలంగాణయేనని అన్నారు. పేదలను ఆదుకోవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్దేశ్యమని, ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని అన్నారు.

కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంత్రి ఈటెల మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘పాజిటివ్‌ కేసులు పెరిగినా, తగ్గినా ఆందోళన అవసరం లేదు. అందరి ఆరోగ్యం బాగానే ఉంది. రాష్ట్రంలోని అన్ని ల్యాబ్‌ల్లో నిరంతరాయంగా పరీక్షలు జరుగుతున్నాయి. ఎన్ని కేసులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. 10 లక్షల పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లల కోసం గాంధీ ఆస్పత్రిలో స్పెషల్‌ వార్డును సిద్ధం చేశాం. ఈ నెల 20న గచ్చిబౌలిలో ఆస్పత్రిని ప్రారంభిస్తాం. ఆ ఆస్పత్రిని 1500 పడకల స్థాయికి తీర్చిదిద్దుతాం.