కరోనా ఎఫెక్ట్‌ : ఆవులకు స్ట్రాబెరీల దానా

కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు విధించిన లాక్‌డౌన్‌ ఓ రైతు పాలిట శాపమైంది. రవాణా వ్యవస్థ నిలిచిపోవటంతో చేతికొచ్చిన స్ట్రాబెరీ పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక పశువులకు దానాగా వేస్తున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సతారా జిల్లాలోని దేర్‌వాడి గ్రామానికి చెందిన అనిల్‌ సాలుంఖీ అనే వ్యక్తి తన రెండెకరాల పొలంలో స్ట్రాబెరీలను సాగుచేశాడు. పంట చేతికొచ్చిన నేపథ్యంలో కరోనా వైరస్‌ అతడి కడుపు కొట్టింది. కరోనా వ్యాప్తి అడ్డుకునేందుకు విధించిన 21రోజుల యావద్దేశ లాక్‌డౌన్‌ కారణంగా పంటను అమ్ముకోవటానికి రవాణా సౌకర్యాలు లేక చేలోనే మిగిలిపోయింది. ( నెల్లూరులో అత్యధికంగా కరోనా కేసులు )

ఏం చేయాలో తెలియక, పంటను వృధా చేసుకోవటం ఇష్టం లేక, మనసు చంపుకుని దాన్ని పశువులకు దానాగా వేస్తున్నాడు. దీనిపై అనిల్‌ స్పందిస్తూ.. ‘‘ రూ. 2,50,000 ఖర్చుపెట్టి పంట వేశా. 8 లక్షలు వస్తుందని ఆశ పెట్టుకున్నా. ఇప్పుడు పెట్టుబడి డబ్బులు కూడా రాలేదు. యాత్రికులు, ఐస్‌ క్రీమ్‌ తయారు చేసే కంపెనీలు స్ట్రాబెరీలను ఎక్కువగా కొంటారు. ఇప్పుడ ఆ పరిస్థితి లేద’’ని ఆవేదన వ్యక్తం చేశాడు. ( కరోనా : తండ్రి అంత్యక్రియలకు కూడా.. )

కొద్దిరోజుల క్రితం బెంగళూరుకు చెందిన ఓ రైతు తను పండించిన ద్రాక్ష పంటను కొనే దిక్కులేక దాన్ని అడవి పాలు చేశాడు. ఐదు లక్షలు ఖర్చు పెట్టి పండించిన పంటను ఎలా అమ్మాలో తెలియక ఈ నిర్ణయానికి వచ్చాడు. చుట్టుపక్కలి గ్రామాల ప్రజలను ఉచితంగా పళ్లను తీసుకుపోమని ఆహ్వానించినా కొద్దిమంది మాత్రమే ముందుకు రావటం గమనార్హం.