అమెరికాని మోసం చేసిన చైనా : అక్రమంగా ప్రయోగాలు చేసిందని వెల్లడించిన అమెరికా


వాషింగ్టన్: చైనా, అమెరికా మధ్య సంబంధాలు ఇప్పటికే దారుణమైన స్థితిలో ఉన్నాయి. ఇరు దేశాలు ఒకరిపై మరొకరు మాటలతో దాడి చేసుకుంటూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇదిలా ఉంటే చైనాపై అమెరికా మళ్ళీ మాటలతో దాడి చేసింది. చైనా రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షించిందని, తక్కువ పేలుడు సంభవించే ఈ ఆయుధాల పరీక్షను భూగర్భంలో నిర్వహించిందని అమెరికా ఆరోపించింది. దీనికి ఆధారాలు చూపలేకపోయినప్పటికీ చైనాలోని లాప్ నర్ ప్రయోగ కేంద్రంలో తవ్వకాలు జరపడంతో పాటు మరికొన్ని ఆనవాళ్లున్నాయని, ఇవి అణు పరీక్ష జరిగినట్లు సూచిస్తున్నాయని అమెరికా ఆరోపించింది.
ఇదిలా ఉంటే అణ్వాయుధాల ప్రయోగాలకు సంబంధించి అమెరికా చైనా ఇరు దేశాలు 1996లో కాంప్రెహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ(సీటీబీటీ) ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఇరు దేశాలు ఈ ఒప్పందాన్ని ఆమోదించలేదు. దాంతో ఈ ఒప్పందం అమలులోకి రాలేదు. అయినప్పటికీ చైనా ఈ ఒప్పందంలోని నిబంధనలకు లోబడి ఉండగా.. అమెరికా తమ దేశంలో అణు పరీక్షలు నిర్వహించడంపై తాత్కాలికంగా నిషేధం విధించింది. అయితే ఒకవేళ ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు ఆమోదించి ఉంటే చైనాలో అణు పరీక్షలు జరిగాయని భావిస్తున్న ప్రాంతాలకు వెళ్లి తనిఖీలు చేసే అధికారం అమెరికాకు లభించేది.