కన్నా.. బీజేపీకి కన్నం వేయొద్దు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పెరగాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు భావిస్తున్నారని.. హైదరాబాద్‌లో కూర్చోని పైశాచిక ఆనందం పొందుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ నియంత్రణకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ నీతి కబుర్లు చెబుతున్నారని.. ఆయన శాశ్వతంగా రాజకీయ సమాధిలోనే ఉంటారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి లక్ష కిట్లు తెప్పించిందని వివరించారు.
ఆ హక్కు వారికి లేదు..
కిట్లు కొనుగోలులో అవినీతి జరిగిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. బాధ్యత గల ప్రతిపక్ష నేత దిగజారి వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. కిట్లు వ్యవహారంలో కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కర్ణాటక రాష్ట్రం ఏపీ కంటే ఎక్కువ ధరకు కిట్లు కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. బీజేపీకి కన్నం వేయొద్దని.. చంద్రబాబుకు తొత్తుగా మారొద్దని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీ నారాయణకు జోగి రమేష్‌ హితవు పలికారు. వంద పార్టీలు, కొంతమంది గుంట నక్కలు కలిసిన.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏమి చేయలేవన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి గురించి మాట్లాడే హక్కు కన్నా, సుజనా చౌదరికి లేదన్నారు. సుజనా లాంటి దొంగలను నమ్మొద్దన్నారు.

బుద్ధి, జ్ఞానం లేనివారంతా అందులోనే..
దేశమంత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బాటలో నడుస్తోందని జోగి రమేష్‌ అన్నారు. కేంద్రం కొనుగోలు చేసిన ధర కంటే..తక్కువ ధరకు ఏపీ ప్రభుత్వం కిట్లు కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్రంలో అనేక మంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనాపై పోరాడుతున్నారని.. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రతిపక్షం  వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. బుద్ధి, జ్ఞానం లేనివారంతా టీడీపీలోనే ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు నీతులు చెబుతుంటే.. ఆయన కుమారుడు లోకేష్‌ .. సైకిల్‌ వేసుకుని రోడ్లపై తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు.