ఎయిమ్స్‌లో వైద్య సిబ్బందికి సోకిన కరోనా


న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందున్నా వేల , వైద్యులు ఎలాంటి వెనకడుగు వేయకుండా ట్రీట్మెంట్ చేస్తున్నారు .  
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ కాపాడే వైద్యులను సైతం హడలెత్తిస్తోంది. తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో గ్యాస్ట్రాలజీ విభాగంలో పనిచేస్తున్న నర్స్‌కు కరోనా సోకింది. దీంతో అతనిపాటు పనిచేసిన 40 మంది వైద్య సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. కాగా నర్సు దక్షిణ ఢిల్లీలోని చత్తర్‌పూర్‌లో నివసిస్తున్నాడు. ఆ అపార్ట్‌మెంట్‌లో నివసించేవారిలో 80 శాతం మంది ఎయిమ్స్‌లో పనిచేస్తున్నవారే కావడం గమనార్హం.  తాజాగా అతనికి కరోనా అని తేలడంతో సదరు నర్సుతో పాటు పనిచేసే 40 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఇందులో పారామెడికల్ సిబ్బందితోపాటు నర్సులు, వైద్యులు కూడా ఉన్నారు. వీరితో ఎవరెవరు సన్నిహితంగా మెలిగారన్న వివరాలను ఆరా తీశారు. మరోవైపు క్వారంటైన్‌లో ఉన్న వీరందరికీ ఐదు రోజుల తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలావుండగా ఢిల్లీలో ఇప్పటివరకు 2376 కేసులు నమోదవగా 50 మంది మృతి చెందారు. శుక్రవారం ఉదయం నాటికి భారత్‌లో 23,077 కరోనా కేసులు నమోదవగా 718 మంది మృతి చెందారు. 4,749 మంది కోలుకున్నారు.