భారత ఐటీ రంగంలో ఈ ఏడాది కొత్త ఉద్యోగాలు లేనట్టే...

కరోనా కల్లోలంతో సంక్షోభంలో పడిన ఐటీ రంగానికి సంబంధించి, ప్రముఖ ఐటీ నిపుణుడు ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ ఆందోళనకర అంచనాలను వెలువరించారు. భారత ఐటీ రంగంలో కొవీఢ్ 19మహమ్మారి ప్రతికూల ప్రభావం కారణంగా ఈ ఏడాది కొత్త ఉద్యోగాల కల్పన ఉండబోదని వ్యాఖ్యానించారు. అలాగే సీనియర్ స్థాయి సిబ్బందికి 20-25శాతం జీతం కోత వుంటుందన్నారు. లాక్ డౌన్ కారణంగా దాదాపు అన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు ఇంటినుంచే పనిచేస్తున్నారనీ, ఇది ఇకముందు కూడా కొనసాగే  అవకాశం ఉందని  ఆయన పేర్కొన్నారు.
ఐటీ పరిశ్రమలు ఈ ఏడాది కొత్తగా ఎవర్ని ఉద్యోగాల్లోకి తీసుకోవని, అయితే ఇప్పటికే ఇచ్చిన కమిట్‌మెంట్లను పరిగణనలోకి తీసుకుంటాయని మోహన్‌దాస్‌ అభిప్రాయపడ్డారు. కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా ఈ సమస్యలు ఎదురవుతున్నాయని, లాక్‌డౌన్‌తో ఐటీ ఇండస్ట్రీలోని 90 శాతానికిపైగా ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల ఇళ్లలో మౌలిక సదుపాయల కల్పన, ఆయా కంపెనీల క్లైంట్ల నుంచి భద్రతాపరమైన అనుమతి లభించడంతో వర్క్‌ఫ్రం హోం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత కూడా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచేయమని చెబుతాయన్నారు.