భారత్ కి ఆస్కార్ తెచ్చిన సినిమా హీరో ఇక లేరు

17

నటుడు  ఇర్ఫాన్‌ అసలు పేరు...సహబ్జాదీ ఇర్ఫాన్‌ అలీ ఖాన్‌. గొప్ప నటుడు మాత్రమే కాదు ప్రపంచ స్థాయి అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న హీరో. 1967 జనవరి 7వ తేదీన జైపూర్‌లో టైర్ల వ్యాపారం చేసుకునే సాయీద బేగం, యసీన్‌ అలీ ఖాన్‌ దంపతులకు జన్మించారు. ఇర్ఫాన్‌, అతని స్నేహితుడు సతీష్‌ మంచి క్రికెటర్లు. తన 23 ఏళ్ల ప్రాయంలో సీకే నాయుడు టోర్నమెంట్‌కు ఎంపికయ్యారు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల క్రికెట్‌లో పాల్గొనలేకపోయారు. ఆ తర్వాత ఇతను ముంబయికొచ్చేశారు. నటన మీద ఉన్న ప్రేమతో ధారావాహికల్లో నటించారు. 'చాణక్య', 'భారత్‌ ఏక్‌ ఖోజ్‌ ', 'సారా జహాన్‌ హమారా' వంటి సీరియళ్లలో పాత్రలు పోషించారు. స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన 'దర్‌' సిరీస్‌లో విలన్‌గా మెప్పించారు. అది మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇర్ఫాన్‌ను వెండితెరకి పరిచయం చేసింది మాత్రం మీరా నాయర్‌. ఆమె దర్శకత్వంలో వచ్చిన 'సలామ్‌ బొంబయి'లో చిన్న పాత్ర ఇచ్చారు. కానీ ఆ సినిమాలో ఆయన నటించలేకపోయారు. ఆ తర్వాత 'ఏక్‌ డాక్టర్‌ కీ మౌత్‌', 'ది గోల్‌' వంటి వాటిల్లో నటించినా అంతగా రాణించలేదు. 2001లో ఆసీఫ్‌ కాపాడియా దర్శకత్వంలో వచ్చిన 'ది వారియర్‌' చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అది మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత 'రోగ్‌'లో ఉదరు రాథోడ్‌ పాత్రలో జీవించేశారు. ఇక అక్కడ నుంచి అవకాశాలు వరుస కట్టాయి. ఇర్ఫాన్‌ ఒక్క హీరోగానే కాదు... దొరికిన ప్రతి పాత్రనూ, మంచిదనుకున్న ప్రతి క్యారెక్టర్‌నూ పోషించారు. తెలుగులో అయితే మహేశ్‌ బాబుతో 'సైనికుడు'లో విలన్‌గా చేసి మన్ననలు పొందారు. తొలిసారిగా ఈయన వెండితెరపై 'హాసిల్‌'లో విలన్‌గా నటించారు. అది మొదటిసారిగా ఆ క్యారెక్టర్‌ చేసినా సరే ఉత్తమ విలన్‌గా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు తెచ్చిపెట్టింది. ఇక ఆయన చేసిన అనేక పాత్రలు అభిమానులు గుండెల్లో నిలిచిపోయాయి. అందులో ఇర్ఫాన్‌ చేసిన చాలా చిత్రాలు సామాజిక అంశాలతో ముడిపడి ఉండడం మరో విశేషం. 'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌', 'న్యూయార్క్‌', 'పాన్‌ సింగ్‌ తోమర్‌', ' ది లంచ్‌ బాక్స్‌', 'పీకూ', 'లైఫ్‌ ఆఫ్‌ పీ' వంటి చిత్రాలు మంచి పేరుతో తెచ్చిపెట్టాయి. అభ్యుదయ కవి ముఖ్దాంమొయిద్దీన్‌ జీవిత కథను బుల్లితెరపై తెరకెక్కించారు. ఇర్ఫాన్‌ ముఖ్దూం పాత్రలో జీవించారు. నిజ జీవితంలోనూ ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను 2011లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. 2017లో చేసిన 'హిందీ మీడియం' బాక్సాఫీస్‌ వద్ద కోట్లు కురిపించింది. ఆ చిత్రంలో నటనకు ఉత్తమ నటుడుగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. 2018లో మార్చిలో కేన్సర్‌ బారిన పడ్డారు. లండన్‌లో దీని కోసం ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. అనంతరం తాజాగా హోమి అదజానియా దర్శకత్వంలో రూపొందిన 'ఆంగ్రేజీ మీడియం'లో నటించారు. మార్చి 13న ఈ సినిమా విడుదలైంది. ఈయన అనార్యోగానికి గురికావడంతో ఈ చిత్రం ప్రమోషన్‌కు హాజరుకాలేకపోయారు. ఐదు రోజుల క్రితం ఇర్ఫాన్‌ ఖాన్‌ తల్లి బేగం జైపూర్‌లో మృతి చెందారు. లాక్‌డౌన్‌ వల్ల ఆమె అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తల్లికి అంతిమ వీడ్కోలు పలికారు. ఈ రోజు ఆఖరి మాటగా 'అమ్మ పిలుస్తోంది'' అంటూ తానూ వెళ్లిపోయారు.