ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణం పట్ల ప్రముఖుల సంతాపం

విలక్షణ నటుడు  ఇర్ఫాన్‌ ఖాన్‌  హఠాన్మరణం పట్ల దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తనకు ఎంతో ఇష్టమైన నటుల్లో ఒకరైన ఇర్ఫాన్‌ ఖాన్‌ ఇంత త్వరగా కన్నుమూయడం బాధ కలిగించిందని మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ పేర్కొన్నారు. ఆయన నటన చిరస్మరణీయమని అన్నారు. ఇర్ఫాన్‌ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఇర్ఫాన్‌ ఖాన్‌ అసాధారణ నటుడని, ఆయనకు మరణం లేదని టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ షమి ట్వీట్‌ చేశాడు. చనిపోయే వరకు అద్భుతమైన తన నటనతో అందరినీ అలరించారని గుర్తు చేసుకున్నాడు.  

మన కాలపు అత్యుత్తమ నటులలో ఒకరైన ఇర్ఫాన్ ఖాన్ మరణం గురించి భయంకర వార్త విన్నందుకు బాధగా ఉందని బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ అన్నారు. ఈ  కష్ట సమయంలో ఇర్ఫాన్ ఖాన్ కుటుంబానికి భగవంతుడు తట్టుకునే శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు. ఇర్ఫాన్ ఖాన్‌ను ఇంత తొందరగా కోల్పోతామని అనుకోలేదని, ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నామని నటి రవీనా టాండన్‌ పేర్కొన్నారు. ప్రతిభావంతుడైన సహ నటుడిని మరణం బాధించిందన్నారు. 

దేశం గొప్ప నటుడిని కోల్పోయిందని అకాలీదళ్‌ నాయకుడు, ఢిల్లీ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు మజీందర్‌ సిర్సా పేర్కొన్నారు. ‘భారత్‌ అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడిని, మంచి మనిషిని కోల్పోయింది. దేవుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాల’ని ఆయన ట్వీట్‌ చేశారు.